నాటకీయత కథకి హృదయం లాంటిది అనుకుంటే ఈ సమస్య & సంఘర్షణలు కథకి పునాది లాంటివి. ఈ సమస్య & సంఘర్షణలే కథలో భావోద్వేగాలు ఉత్పన్నం అవడానికి కారణం అవుతాయి. జీవితంలో సమతౌల్యాన్ని దెబ్బతీసే సమస్య ఏర్పడినపుడు దాని నుండి బయటపడటానికి సమఉజ్జీలైన ఇరుపక్షాలు చేసే ప్రయత్నం(సంఘర్షణ) వల్ల ఫలితంపై (ముగింపు) ఉత్కంఠ ఏర్పడుతుంది. ఇవి కథలో నాటకీయతని సజీవంగా ఉంచడంలో నిర్ణాయకమైన పాత్రని పోషిస్తాయి. సమస్య & సంఘర్షణ, ఉత్కంఠ, ముగింపు అనేవి కథన శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణాలని చెప్పవచ్చు.
సమస్య (Struggle) : సమస్య అంటే సర్దుకుపోడానికి వీల్లేనిదై, మన జీవితంలో సమతౌల్యాన్ని దెబ్బతీసి మన ఉనికికి (మన మనుగడకి లేదా మన ఆశయాలకి) అడ్డంకిగా ఉండే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలనే స్థిరమైన నిశ్చయానికి రావటమే సమస్య. పాత్రల జీవితంలో పడే మామూలు ఇబ్బందులు కథని ముందుకు తీసుకెళ్ళలేవు. సంఘర్షణకి లోనుచేసేవై ఉండాలి.
ఈ సమస్యలు అనేక రకాలుగా వుండచ్చు.
ఉదా:
1.మానసికం : మన ఆలోచనలు, సిద్ధాంతాల భేదాలు, మానసిక సమస్యల వల్ల ఏర్పడే సమస్యలు
ఉదా : శుభలగ్నం, అహనా పెళ్లంట, The Butterfly Effect
2.వ్యక్తిగతం : కుటుంబం. వివాహం, ప్రేమ, స్నేహం వల్ల ఏర్పడే సమస్యలు
ఉదా : చిత్రం, హృదయం, రక్త సంబంధం, కలికాలం
3.సాంఘీకం : వ్యవస్థలో లోపాల వల్ల ఏర్పడే సమస్యలు
ఉదా: అంకురం, శివ, సత్య
4.భౌగోళికం : దేశాల మధ్య, సంస్కృతల మధ్య వైవిధ్యం వల్ల ఏర్పడే సమస్యలు
ఉదా: My Big Fat Greek Wedding, గదర్.
4.ప్రాకృతికం : ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే సమస్యలు.
ఉదా: Twister, 2012, Armageddon, The Perfect Storm
5.మానవాతీత(అతీంద్రియ) శక్తులు : ఇంద్రియాలకు లోబడిన మానవుల పరిధిని దాటి వుండే శక్తుల వల్ల ఏర్పడే సమస్యలు.
ఉదా: Aliens, హారర్ చిత్రాలు
కథలని బట్టి ప్రతినాయకులుంటారు. శుభలగ్నంలో హీరోయిన్ ధనాశే విలన్, అహనాపెళ్లంటలో మామగారి పీనాసితనం విలన్, అంకురంలో వ్యవస్థ, శివలో రౌడీయిజం, జురాసిక్ పార్క్‌లో రాకాసిబల్లుల ప్రతిసృష్టి, ట్విస్టర్‌లో తుఫాను.
సంఘర్షణ (Conflict) : లక్ష్యసాధనలో భాగంగా ఎదురయ్యే సవాళ్లని స్వీకరిస్తూ బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ ఫలితం తేలే వరకూ ముందుకు సాగడమే సంఘర్షణ.
సమస్యని ఎదుర్కోవాలనే ఆలోచనే లేకుండా దాని ముందు సాగిలపడినపుడు సమస్య అనే మాటే లేదు. ఎప్పుడైతే పరిస్థితుల్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటామో అప్పుడే సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యలో ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే మనం ఎదుర్కోబోతున్న శత్రువు, లేదా పరిస్థితులు ఇవెప్పుడూ కూడా మనకన్నా ఉన్నత స్థితిలో వున్నవే అయివుంటాయి లేదా మన ఆలోచనకి అందని, మన శక్తి సామర్ధ్యాలకి పరీక్ష పెట్టే పరిస్థితులే మనకి ఎదురవుతాయి. హీరోని చూచి విలన్ బయటపడుతున్నాడంటే అది గతంలో ఏదో హిట్ సినిమాకి కొనసాగింపు అని అర్ధం. అంటే విలనిజం అద్భుతంగా వున్న సినిమాలో హీరో విలన్‌ని జయించడం చూచి - అది నచ్చిన దర్శకులు - ఆ హీరోకి ఆ ఇమేజ్ ఎందుకొచ్చిందో తెలీక తమ తర్వాతి కథల్లో ప్రతినాయక పాత్రకి సానబెట్టడం మాని నాయక పాత్రలో గొప్పలక్షణాలు పెంచుకుంటూపోతారు. సరైన విలనిజం లేక హీరో చర్యలు చప్పగా వుంటాయి. చెడు లేక మంచి లేదు. చెడు లేని మంచికి విలువ లేదు. కాబట్టి మంచిని వెదకడంకాదు చెయ్యాల్సింది, చెడుని కనిపెట్టాలి. ఆ చెడు లోంచే మంచి పుట్టుకువస్తుంది. మంచి దానికది పుట్టదు. గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు, వేమన, శిరిడీ సాయిబాబా, మహాత్మాగాంధీ వీరందరూ వచ్చింది ఎందుకు??? యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అని గీతలో కృష్ణుడు చెప్పింది. అధర్మం పెరిగిపోయి ధర్మానికి హాని జరిగినపుడు నేను అవతరిస్తాను అన్నాడు. పైన చెప్పిన దాని అర్ధం ఇదే. విలనిజం ఎలా అభివృద్ధి చేయాలో తెలియని వారే సృజనపై ఆధారపడం మాని హీరోలపై పూర్తిగా ఆధారపడతారు.
Ex:మనం ఒక ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ పెట్టుకున్నాం. దీన్లో అవినీతి పెరిగింది. ఇది చూచి దీన్ని నిర్మూలించాలని ఒకడు బయలుదేరాడు.
మంచి - చెడు - మంచి అనే మార్పులు ఇక్కడ జరుగుతున్నాయి. అంతే తప్ప అవి వేరు వేరు కాదు.
నేర్చుకోడానికి ఏమీలేని కథానాయకుడు ఎప్పటికీ నాయకుడు కాలేడు ఎందుకంటే సమస్య యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే మనిషి శక్తి, సామర్ధ్యాలని పెంచి, మానవ మేధని తానున్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే. అలాకాక సమస్య పెద్దది, మనిషి పరిధి చాలా తక్కువ - కనుక సమస్యలే ఎప్పుడూ మనిషిపైన విజయం సాధిస్తాయి అనే ఆలోచనా విధానం కళాత్మక సినిమాది - ఈ ప్రతికూల దృక్పధం యొక్క పరిధి అత్యంత చిన్నది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో వున్న సినిమా రచనా విధానం పూర్తి సానుకూల దృక్పధంతో మానవ మేధని అభివృద్ధి చేసేదిగా వుండి సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దానిపై మానవుడు విజయం సాధించగలడు అని నిరూపిస్తూనే వుంది. మనిషి ఫలాన సమస్యని సాధించగలడు అని చెప్పాలనుకున్నప్పుడు ఆ మనిషి సామర్ధ్యాన్ని పరీక్షించాలి లేదా అతను స్వయంగా సామర్ధ్యాన్ని పెంచుకోవాలి - దీనికి సంభావ్యత (Probability tool) వుంది.
సమస్య అన్నప్పుడు మనలో చాలా మంది దాన్ని Struggle గా కాకుండా Problem గా నిర్వచిస్తుంటారు. ఈ రెంటికీ చాలా బేధం వుంది. ప్రాబ్లంని ఇబ్బందిగా భావించాలి, స్ట్రగుల్‌ని సమస్యగా భావించాలి. ఎందుకంటే మనం ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ బ్రతకొచ్చు. కానీ సమస్య ఏర్పడినపుడు జీవితంలో సమతౌల్యం దెబ్బతింటుంది దాన్ని తిరిగి ప్రతిష్టిస్తే తప్ప జీవనం సాధ్యంకాదు. అంటే సమస్యతో రాజీపడితే నైతికంగా దిగజారడంగానీ లేదా సమస్యకి పరిష్కారం చూడకపోతే త్వరితగతిన జీవితం అస్తవ్యస్తం అవడంగానీ జరుగుతుంది
ఉదా: శివ సినిమాలో హీరో ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులుంటాయి, అతని ఒదిన అతను తమపై ఆధారపడ్డాడని చులకనగా చూస్తుంది. అన్న ఏమనుకుంటాడో అని అతను ఇంటి నుండి వెళ్లలేడు. అంటే ఈ ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఇంట్లోనే వుంటాడు. కానీ కళాశాలలో ఎన్నికల్లో పోటి చేసిన తన మిత్రుణ్ని దారుణంగా కొట్టినప్పుడు అతని అహానికి తగిలిన దెబ్బ అతని మానసిక సంతులనాన్ని దెబ్బతీస్తుంది. దాన్ని తిరిగి ప్రతిష్టించాలంటే సమస్యని ఎదుర్కోవాలి. ఇదీ ఇబ్బందికీ, సమస్యకీ తేడా.
సంఘర్షణనే అంతర్గత, బహిర్గత సంఘర్షణగా నిర్వచిస్తుంటారు కొందరు. దీన్ని నేను ప్రేరణ అనే విభాగంలో అంతఃప్రేరణ, బాహ్యప్రేరణగా ఉపయోగించడం జరిగింది. వీటిని ఈ విభాగంలో చూడండి.
The Matrix చిత్రంలో హీరో బలమైన శత్రువుని ఎదుర్కోవడంతో (బాహ్యప్రేరణ) పాటు తన శక్తి సామర్ధ్యాలెంతటివో తనే తెలుసుకోవాలి (అంతఃప్రేరణ), ఇదే సమస్య. ఇతన్ని అందరూ నీలో గొప్ప శక్తి వుంది అంటారు, ఇతనేమో హనుమంతుడిలా తన శక్తి సామర్ధ్యాలు తెలీక ఇబ్బంది పడుతుంటాడు. ఇతను తన శక్తిని సినిమా చివరలో తెలుసుకుంటాడు. తనున్న ఈ ప్రపంచంలో మరణంలేదని, ఈ ప్రపంచంలో తను ఎప్పటికీ జీవించే వుండొచ్చని తన సమస్యలు తన ముందు పిపీలికాలని తెలుసుకుంటాడు. అప్పుడు తనున్న ప్రపంచంపై అతను పూర్తి ఆధిపత్యం సాధిస్తాడు. Lobsang Rampa రాసిన You Forever (1965) (తెలుగులో - మరణంలేని మీరు) నవలలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలకి ఇది దృశ్యరూపం. (కాపీ అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు).
- మూల్పూరి. ఆదిత్య చౌదరి.
(greenlong2498@gmail.com)